80% కరోనా పేషెంట్స్ రక్తంలో అదే లోపం ?
లండన్: కరోనావైరస్కి ఓ వైపు వ్యాక్సిన్ కనుక్కునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయో… మరోవైపు కరోనా సోకుతున్న వారిపైనా అందుకు గల కారణాలపై పరిశోధనలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి.
స్పెయిన్‌లో జరిగిన ఓ పరిశోధనలో కొవిడ్-19 సోకిన వారిలో 80 శాతం మంది విటమిన్ డి (Vitamin D) లోపంతో బాధపడుతున్నట్టు తేలింది.
యూనివర్శిటారియో మార్క్యూస్ వల్డెసిల్లా హాస్పిటల్లో ( Hospital Universitario Marques de Valdecilla ) 216 మంది కొవిడ్-19 పేషెంట్స్‌ని పరీక్షీంచగా వారిలో 80 శాతం మందికి విటమిన్-డి లోపం ఉన్నట్టు తెలిసింది. అందులోనూ మహిళలతో పోల్చుకుంటే మగవారిలో విటమిన్ డి లెవెల్స్ మరీ తక్కువగా ఉన్నట్టు పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటాబాలిజం జర్నల్‌లో ఈ అధ్యయనం ఫలితాలను ప్రచురించారు.
ఇదే విషయమై స్పెయిన్‌లోని శాంటండర్లో ఉన్న కాంటాబ్రియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జోస్ ఎల్ హెర్నాండెజ్ ( Jose L. Hernandez ) మాట్లాడుతూ..” డి విటమిన్ లోపంతో బాధపడే కరోనా పేషెంట్స్‌కి విటమిన్ డి చికిత్సను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది” అని అభిప్రాయపడ్డారు. ”మరీ ముఖ్యంగా కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపించే వృద్ధులు, ఇతర రోగులలో విటమిన్ డి లోపాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా వారికి చికిత్స చేపట్టినట్టయితే మెరుగైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది” అని హెర్నాండెజ్ తన పరిశోధనల్లో పేర్కొన్నారు.