తెలుగు

కువైట్ లో చిక్కుకు పోయిన వ్యక్తిని ఆదుకున్న బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చొరవ వల్ల వీసా ఏజెంట్ మోసం వల్ల అక్రమ కేసులో ఇరుక్కొని కువైట్ లో చిక్కుకుపోయిన ఓ తెలంగాణవాసి స్వదేశం చేరుకోనున్నారు. ఆయన కృషితో గంగాధర్ కువైట్ నుంచి భారత్ వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగాధర్ బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లాడు. అక్కడే నివసిస్తున్న భారతదేశానికి చెందిన ఓ వీసా ఏజెంట్ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులు చెల్లించకపోవడంతో సదరు ఏజెంట్ గంగాధర్ పై వీసా అక్రమం కింద కేసు పెట్టాడు.

కువైట్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తమ దేశానికి వచ్చిన, వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్న భారతీయులకు క్షమాభిక్ష ప్రసాదించి స్వదేశం పంపిస్తోంది. ఈ నేపథ్యంలో గంగాధర్ భారత్ వచ్చేందుకు క్షమాభిక్ష కోరుతూ కువైట్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇతనిపై కేసు నమోదు కావడంతో క్షమాభిక్ష ఇవ్వలేమని కువైట్ అధికారులు చెప్పడం ఆయనను షాక్ కు గురి చేసింది. దేశం కాని దేశంలో ఆపదలో ఉండి దిక్కుతోచని పరిస్థితులో ఉన్న గంగాధర్ బండి సంజయ్ కుమార్ పై నమ్మకం పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో నన్ను ఆదుకోవాలంటూ గంగాధర్ సోషల్ మీడియా ద్వారా బండి సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన సంజయ్ కుమార్ జరిగిన విషయాన్ని వివరిస్తూ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీథరన్ కు లేఖ రాశారు. సంజయ్ లేఖపై స్పందించిన కేంద్రమంత్రి గంగాధర్ కు తగిన సాయం అందించాల్సిందిగా కువైట్ లోని భారత రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కువైట్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించింది.

గంగాధర్ పై వేసిన అక్రమ కేసును ఉపసంహరించారు. దీంతో ఆయన క్షమాభిక్ష కింద స్వదేశం వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆపదలో ఉన్న తనను ఆదుకొని, తన కుటుంబం చెంతకు వెళ్లేందుకు చొరవ చూపిన బండి సంజయ్ కుమార్ కు గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు.

విదేశాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్న తెలంగాణవాసుల కష్టాలను తీర్చేందుకు బండి సంజయ్ ఎప్పుడూ ముందుంటారు. కువైట్ లో చిక్కుకుపోయిన నిజామాబాద్ వాసి గంగాధర్ మాత్రమే కాదు అనేక మందిని బండి సంజయ్ కుమార్ ఆదుకొని స్వదేశం వచ్చేలా చేశారు. కరోనా సమయంలోనూ విదేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను స్వదేశం రప్పించేందుకు విశేష కృషి చేశారు. తాజా ఘటన మరో ఉదాహరణ మాత్రమే.

Have your say

four × 3 =