వైరాలో బీజేపీ నేత దారుణహత్య
ఖమ్మం జిల్లా వైరాలో శనివారం రాష్ట్ర బీజేపీ ఆర్టీఐ సెల్ కో-కన్వీనర్ నేలపల్లి రామారావు (45) ఆయన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు, వైరాకే చెందిన మాడపాటి రాజేశ్. రామారావును అతడు 11సార్లు కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన రామారావును ఆస్పత్రికి తరలిస్తుంగానే మృతిచెందారు.
ఆర్థిక వ్యవహారాలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. వైరా ఏసీపీ కె.సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం వైరాలో శారదా నర్సింగ్‌హోం సమీపంలోని తన ఇంట్లో తల్లి నాగమ్మతో కలిసి రామారావు ఉంటున్నారు. శనివారం ఉదయం రామారావు ఇంటికి వెళ్లిన రాజేశ్ నేరుగా ఆయన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు.
రామారావు రాగానే కత్తితో దాడి చేశాడు. పొట్ట, మెడ, తల, చేతులపై విచక్షణారహితంగా పొడిచాడు. రామారావు బిగ్గరగా కేకలు వేయటంతో వంటగదిలో ఉన్న తల్లి నాగమ్మ అక్కడికి వచ్చి.. తన కొడుకును చంపొద్దంటూ అతడి కాళ్లపై పడి వేడుకున్నారు. అయినా రాజేశ్ కనికరించలేదు. అనంతరం రక్తంమరకలతోనే అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికులు రామారావును ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. కాగా శుక్రవారమే రామారావు ఇంటికి వెళ్లిన రాజేష్ ల్లి నాగమ్మతో నీ కొడుకును చంపుతానని హెచ్చరించాడు. రాజేశ్‌ను మధిరలో పోలీసులు అదుపులోకి తీసుకొని వైరాకు తరలించారు.
రామారావు, రాజేశ్ రెండేళ్ల క్రితం దాకా సన్నిహితులు. ఒక వ్యాపారి నుంచి రామారావుకు రాజేశ్ వడ్డీ కింద లక్షల్లో అప్పు ఇప్పించాడు. అందులో కొంత మొత్తాన్ని రామారావు తీర్చాడు. మిగిలిన మొత్తం చెల్లించే విషయంలో రామారావు, రాజేశ్ మధ్య స్పర్థలు నెలకొన్నాయి. అవి రెండేళ్లుగా తీవ్రరూపం దాల్చాయి. హత్యకు ఇదే కారణమా? అని దర్యాప్తు చేస్తున్నారు.