సీఎం మార్పుపై కథనాలను కొట్టిపారవేసిన కేసీఆర్

Author: Share:

కుమారుడు కేటీఆర్ ఒకరి, రెండు నెలల్లో ముఖ్యమంత్రిగా తన స్థానంలో పదవీ బాధ్యతలు చేబట్టబోతున్నారని అంటూ కొద్దీ రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కే చంద్రశేఖరరావు కొట్టిపారవేసారు. ఈ విషయమై కొందరు మంత్రులతో పాటు పార్టీ నేతలే ప్రకటనలు చేస్తుండడాన్ని ప్రస్తావిస్తూ సీఎం మార్పు గురించి ఇక మాట్లాడటం మానివేయమని ఆదేశించారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, సీఎంగా తానే కొనసాగుతానని వెల్లడించారు.

ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంకోసారి మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానని స్పష్టం చేశారు. ఎక్కడైనా లూస్ టాక్ చేస్తే బండకేసి కొట్టి పార్టీ నుంచి బయట పారేస్తానని హెచ్చరించారు.

తానే పూర్తి పదవీకాలం సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని, నాకు పదవులు ముఖ్యం కాదు.. ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలేశాను. మరో పదేళ్లు సీఎంగా నేనే ఉంటానని గతంలోనే అసెంబ్లీలో చెప్పాను.’ అని గుర్తు చేశారు.

కొత్త సీఎం అంటూ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌ భారీగా బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు స్థానిక కమిటీలు లేకుండానే నెట్టుకు వస్తున్నారు. మరోసారి త్వరలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

మరోవంక పార్టీ ఎమ్యెల్యేలపై పార్టీ కార్యకర్తలలో పెరుగుతున్న అసంతృప్తిని పరోక్షంగా కేసీఆర్ ప్రస్తావించారు. ‘కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధిపత్యం ఎక్కువైంది. నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా మన టీం. వాళ్లందరినీ గౌరవించాలి. మళ్లీ మీరు గెలవాలంటే కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు పనిచేయాలి. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండి విపక్షాలకు కౌంటర్‌ ఇవ్వాలి’ అని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

కేంద్రంపై మడమ తిప్పడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని చెప్పేవి ఉంటాయి..మరికొన్ని చెప్పనవి ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో మాట్లాడాల్సి ఉంటుందని తెలిపారు.

Previous Article

భారతరత్నాలపై దర్యాప్తా? నిప్పులు చెరిగిన బిజెపి

Next Article

ప్రజలను పీడించుకుతింటున్న కేసీఆర్ కు భయం పుట్టిస్తా

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + 13 =