ఏకధాటిగా కుండపోత వర్షంతో అంతా అల్లకల్లోలం

Author: Share:

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వానలు విరామం లేకుండా దంచికొడుతున్నాయి. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న వాన మంగళవారానికి ఉగ్రరూపం దాల్చింది.    రోజంతా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానకు లోతట్టు ప్రాంతాలతో పాటు పలు బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. పురాతన భవనాల్లో నివసిస్తున్న ప్రజలను బల్దియా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.   

నగరం   మొత్తం నీళ్లతో నిండిపోయింది.. రోడ్లన్నీ కాలువల్లా మారాయి. కాలనీలు చెరువలుల్లా మారిపోయాయి. రోడ్లపై నడుం లోతు నీళ్లతో కార్లు, బైకులు మునిగిపోయాయి. హైదరాబాద్‌లో  ఏకధాటిగా 18 గంటలపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ఇండ్లు జలమయమయ్యాయి. వానలు, వరదల ధాటికి ఏడుగురు గల్లంతవ్వగా, గోడ కూలి హైదరాబాద్‌లో 8 మంది, రంగారెడ్డిలో ఇద్దరు మృతిచెందారు.

రోడ్లపై వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికెళ్లేందుకు బయలుదేరిన వాళ్లు.. ఎక్కడిక్కడే రోడ్లపై చిక్కుకుపోయారు. వర్షం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకపోవడంతో వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. గత రాత్రి అంతా వర్షం కురుస్తూనే ఉండడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లతో చాలామంది ఆఫీస్ లలోనే రాత్రి జాగారం చేశారు. 

నగరంలో ఆగకుండా కురుస్తున్న ఈ వర్షంతో దాదాపు 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షపాతం నమోదైంది. 2000 సంవత్సరంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మంగళవారం ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది. రాత్రి 11 గంటల లోపే హైదరాబాద్‌లో వర్షపాతం 25 సెంటీమీటర్లు దాటిపోయింది. ఇంకా భారీ వర్షం పడుతుండటంతో 30 సెంటీమీటర్లు దాటిపోయే పరిస్థితి కనిపిస్తోంది. 

మరో రెండురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా ఘట్కేసర్‌లో 30 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. హయత్ నగర్‌లో 26 సెంటీమీటర్లు, భువనగిరి జిల్లా వలిగొండలో 25 సెంటీమీటర్ల వర్షం పడింది. 

హైదరాబాద్‌ ప్రధాన జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ పూర్తి స్థాయిలో నిండటంతో సమీప ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హుస్సేన్‌ సాగర్‌ నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు  

భారీ వాహనాలు కదలలేని పరిస్థితి ఉంది. ఆటోనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేటలోనూ వర్షపు నీరు రహదారిపైకి చేరడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు.   బుధ, గురువారాల్లోనూ భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌ సహా 17 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది.

పలుచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. 33 ఏండ్ల నాటి వాన రికార్డు బద్దలైంది. 1988లో 83.2 సెంటీమీటర్ల వర్షం కురియగా.. ప్రస్తుతం 110.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ శివారు కుత్బుల్లాపూర్‌లోని షపూర్‌నగర్‌లో 2000లో అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షం కురియగా.. మంగళవారం ఘట్కేసర్‌లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భారీవర్షాలపై మంగళవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమీక్షించారు.  రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ పరిధిలోని పరీక్షలు వాయిదాపడ్డాయి. బుధ, గురువారాల్లో జరగాల్సిన యూజీ, పీజీ ఎగ్జామ్స్‌ ను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ తేదీలను నిర్ణయించి, త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Source
Nijamtoday.com

Previous Article

Aarey CarShed: Mumbaikar’ betrayal by the Thackeray Lead MVA Govt

Next Article

FactCheck: No one attacked Tanishq Store in Ghandidham, clarifies Manager.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − twelve =