తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: ఉద్యమం నాటి ఆశలు, ఆశయాలు నెరవేరాయా??

Author: Share:

• తెలంగాణ రాష్ట్రం నేటితో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సరిగ్గా ఇదే రోజున అంటే 2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
భాషా ప్రాతిపదికన 1956లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు భాగంగా ఉన్న తెలంగాణ 58 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయింది. ఉత్తరాఖండ్‌, హరిత్‌ప్రదేశ్‌ల లాగానే సుదీర్ఘ కాలంగా ప్రత్యేక రాష్ట్రసాధన కోసం తెలంగాణ లో ఉద్యమం జరిగింది. ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ఈ ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి.

అసలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కోస్తాంధ్రా, రాయలసీమ, తెలంగాణ అనే పేర్లలోనే వివిధ ప్రాంతాల మధ్య వైరుధ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ”మేమంతా తెలుగువాళ్లం” అంటూ దాదాపు యాభై ఏళ్ల పాటు ఒక రాష్ట్రంగా కలిసి ఉన్నప్పటికీ, తెలుగు మాట్లాడే ప్రజల మధ్య సామాజికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగాల పరంగా ఐక్యత ఏర్పడలేదు. ఒక్క తెలంగాణలోనే కాదు…రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. ముల్కీ నిబంధనల ఉల్లంఘనతో 1960 లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది.

మలి దశ తెలంగాణ పోరాటం చాలా కీలకమైంది. అధికారంలో సరైన వాటా ఇవ్వకపోవడం, నిధుల కేటాయింపులో వివక్ష, ప్రాంతీయ వెనకబాటుతనం ఈ మూడు అంశాలు తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు సమయంలోనే దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ”తెలంగాణ ప్రజల భయం ఏంటంటే…వారు ఆంధ్రాలో కలిసిపోయినా, ఆంధ్రులతో సరిసమానంగా వారు హక్కులను అనుభవించలేరు. ఈ ఒప్పందంలో ఆంధ్రులు తమ ప్రయోజనాలను సత్వరమే అందిపుచ్చుకుంటారు. చివరకు తెలంగాణ కోస్తాంధ్రులకు కాలనీగా మారిపోతుంది.

• తెలంగాణ అవతరణ దినోత్సవం : విలీనం నుంచి విభజన దాకా..

వ్యవసాయ ఉత్పత్తులలో భారీ పెరుగుదల రూపంలో వీటి ఫలాలు కనిపించాయి. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలు ప్రస్తుత పాలకపక్షం అన్నదాతలకు అనుకూలమన్న వాదనకు బలం చేకూరుస్తాయి. అయితే కౌలు రైతులను ఈ పథకాలలో భాగస్వాములను చేయకపోవడం, ధనికులైన రైతులను ఈ పథకం నుంచి మినహాయించకపోవడం లాంటి అంశాలు విమర్శలకు తావిచ్చాయి.

కోవిడ్‌ -19 సృష్టించిన సంక్షోభం, లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులను అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆర్ధిక ప్రగతిని సాధించడం కోసం మౌలిక సదుపాయాల విస్తరణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైదరాబాద్‌ నగరం ఐటీ రంగానికి వెన్నెముక కాగా, వీటితోపాటు ఫార్మా, టెక్స్‌టైల్‌ సిటీలు పారిశ్రామికాభివృద్ధికి చోదకాలుగా మారాయి. అయితే ఉద్యమ సమయంలో ఉపాధి అవకాశాలపై యువత పెట్టుకున్న అంచనాలకు, ఇప్పుడున్న అవకాశాలకు పొంతన కుదరడం లేదు.

నయా ఉదారవాద విధానాల వల్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోయినా, ప్రైవేటు రంగంలో వాటి సంఖ్య పెరగాల్సి ఉంది. కానీ సేవారంగం అనుకున్నంతగా విస్తరించలేదన్నది గమనించాలి. అంటే తెలంగాణను నిరుద్యోగ సమస్య ఇంకా వెంటాడుతూనే ఉందన్నమాట.

పాలనను వికేంద్రీకరించడంలో భాగంగా గతంలో ఉన్న 10 జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని, 1980లలో అప్పటి ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద పంచాయితీ సమితులను చిన్న మండలాలుగా మార్చిన విభజనతో పోల్చవచ్చు. అప్పటి ఆ నిర్ణయంవల్ల పంచాయితీరాజ్‌ విధానంలో రాజకీయ వికేంద్రీకరణ జరిగి, ప్రజాప్రాతినిధ్యం పెరిగిందన్న విషయాన్ని మరువకూడదు.

తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగం ఫలించిందా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తర్వాత జరిగిన రాజకీయార్ధిక అభివృద్ధిని ప్రాంతీయ గుర్తింపు, అభివృద్ధి ఆకాంక్షలు, వ్యవసాయం, నీటిపారుదల రంగాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ప్రజాసాధికారత, ప్రజాస్వామ్యం ఆధారంగా విశ్లేషించాలి.

తెలంగాణ ఉద్యమం అనేది ప్రజాచైతనం, రాజకీయ చైతన్యం అనే రెండు మూలస్థంభాల మీద నిలబడింది. ఉద్యమ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్‌) ప్రధాన రాజకీయ పార్టీగా ఆవిర్భవించగా, తెలంగాణ ప్రజలను చైతన్యపరచడంలో ప్రజాసంఘాలు కీలక పాత్ర పోషించాయి. రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, టీఆర్ఎస్‌ పాలన ఎలా ఉంది? ఉద్యమ ప్రాథమిక లక్ష్యాల సాధన ఎంత వరకు జరిగింది? అన్నది విశ్లేషించుకోవాల్సిన సమయం ఇది.

తెలంగాణ ఉద్యమం యావత్తు సాంస్కృతిక నేపథ్యంగా సాగుతుంది. కోస్తాంధ్ర సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి మధ్య చాలా అంతరాలున్నాయి. కళాసాంస్కృతిక రంగాలపై ఆంధ్రులకు మంచి పట్టుంది. సినిమా, కళా, పత్రికా రంగాలను వారు పూర్తిగా ఆక్రమించగా, తెలంగాణ ఉద్యమం అంతా పాటలు, కథలతోనే నిండిపోయింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు, బతుకమ్మ పండగలు ప్రతీకలుగా మారిపోయాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బతుకమ్మ పండుగను పూర్తిస్థాయిలో రాష్ట్ర పండగగా మార్చేశారు. ఇక్కడే కాదు.. తెలంగాణ ప్రజలున్న అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో పాటు‌, న్యూజీలాండ్‌ లాంటి దేశాలలో కూడా ఘనంగా జరుపుకున్నారు.

తెలంగాణ ప్రాంతం ప్రధానంగా వర్షాధారిత వ్యవసాయ ప్రాంతం. తెలంగాణ ఉద్యమంలో సాగునీరు ఒక ప్రధాన ఎజెండాగా సాగింది. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలను పెంపోదించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్‌ కాకతీయ’లాంటి ఇరిగేషన్‌ స్కీమ్‌లను ప్రారంభించింది. చెరువుల మీద ఆధారపడే వ్యవసాయానికి దన్నుగా నిలిచే క్రమంలో గ్రామీణ చెరువులను పూడిక తీయించడం, బాగు చేయించడంలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. సమైక్యాంధ్రలో పాలకులు వీటిని అసలు పట్టించుకోలేదని, చిన్నచూపు చూశారన్న ఆరోపణలున్నాయి.

టీఆర్ఎస్ ఇరవయ్యేళ్ల ప్రయాణం: అస్తిత్వ పోరాటం నుంచి అధికార పీఠం వరకు

ప్రజాసంఘాలను పక్కనబెట్టడం అనేది తెలంగాణ రాజకీయాలలో ఒక వైరుధ్యమైన కోణం. రాజకీయ పార్టీలకు అతీతంగా సమాజంలోని మేధావులు, విద్యావంతులు, సాంస్కృతిక సంఘాలు తెలంగాణ ఆవిర్భావం కోసం తమవంతుగా కృషి చేశాయి. ప్రజలను కదిలించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ వేడిని రగిలించాయి. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కుల, మత, వర్గ విభేదాలను రూపుమాపి అందరినీ ఉద్యమం అనే గొడుగు కిందికి తీసుకురావడంలో ప్రజాసంఘాల పాత్ర ఎనలేనిది. ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించడం, ఎజెండాను సైతం రూపొందించడంలో ప్రజాసంఘాలు కీలకపాత్ర పోషించాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రజాసంఘాలు చిన్నచూపుకు గురయ్యాయి. ఆదర్శ ప్రజాస్వామిక రాజ్యంగా అవతరించాలని కన్నకలలు ఎన్నికల రాజకీయాలలో కొట్టుకుపోయాయి.

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతిపక్షం అనేది తప్పకుండా ఉండాలి. కానీ తెలంగాణలో మాత్రం ఏక పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. పుట్టుక, సంస్కృతి, సామాజిక, విధానాలపరంగా ఫక్తు ఆంధ్రా పార్టీగా ముద్రవేయించుకుని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తన వైభవాన్ని కోల్పోగా, కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వెనకబడిపోయి, ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉంది. పోటీ అనేది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. కానీ కాంగ్రెస్‌, ఇంకా ఇతర ప్రతిపక్ష పార్టీలు కనీస పోటీని కూడా ఇచ్చే స్థితిలో లేవు. ఇది తెలంగాణకు భావనకు పూర్తిగా విరుద్ధం.

విద్యావకాశాలు మెరుగుపరచడం ద్వారా అసమానతలకు నిలయమైన భారతీయ సమాజంలో అణగారిన వర్గాలను పైకి తీసుకురావాడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వెనకబడి ఉంది. విద్యపై దృష్టిసారించి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించకపోతే తిరోగమనం తప్పదు. విద్యారంగంలో ముఖ్యంగా ఉన్నత విద్యపై నిర్లక్ష్యం సమీప భవిష్యత్తులో అభివృద్ధికి పెద్ద అవరోధంగా మారే ప్రమాదం ఉంది. విద్యావకాశాలను కల్పించకపోవడం, మెరుగుపరచకపోవడం వల్ల బంగారు తెలంగాణ లక్ష్యం దెబ్బతింటుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహం తెలంగాణకు దిశానిర్దేశం లేకుండా చేస్తాయి.

ఏడు వసంతాల తెలంగాణలో ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు, చేసిన పనులు, ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలను మరోసారి అవలోకనం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.

Author: Ch. Siddharth Reddy

Previous Article

Reservations for OBC and EWS in Medical Courses

Next Article

డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఆరోగ్య భద్రత అందించాలి

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − 4 =